హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు తెలంగాణ హైకోర్టులు నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాన్ని ఆపాలని తాము ఎందుకు ఆదేశించకూడదో తెలపాలని ఆదేశించింది. వాణిజ్య సముదాయ భవనం నిర్మాణం ఆపాలని కోరుతూ శ్రీనగర్ కాలనీకి చెందిన ఇంద్రసేన్ చౌదరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది.
రైలు మార్గం కోసం సేకరించిన భూమిని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వాణిజ్య అవసరాల కోసం వినియోగించడం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ యలమంచిలి వాదించారు. అక్కడ వాణిజ్య భవనం నిర్మాణం కోసం ఫ్రీలెఫ్ట్ తొలగించి నివాస ప్రాంతాల నుంచి ట్రాఫిక్ మళ్లించి ఇబ్బందులు సృష్టిస్తున్నారని అన్నారు.
వాదనలు విన్న మాజీ సీజేఐ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాస్కర్ రెడ్డితో కూడిన ధర్మాసనం హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్, ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.