మలేసియా మాజీ ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీమ్ ఆ దేశ ప్రధాని అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో అక్కడ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ దేశ చక్రవర్తి సుల్తాన్ అబ్దుల్లా.. కొత్త ప్రధానిని నియమించారు. అన్వర్ లేదా మాజీ ప్రధాని యాసిన్ ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్వల్ప మెజారిటీ కూడా సాధించలేకపోయారు. చక్రవర్తి సుల్తాన్ సమక్షంలో మలేసియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీమ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మలేషియాకు అన్వర్ పదో ప్రధాని కానున్నారు.
అన్వర్‌కు చెందిన పకాటన్ హర్పన్ (పీహెచ్) పార్టీ శనివారం జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలిచింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని సీట్లను ఆ పార్టీ గెలవలేకపోయింది. ఏ పార్టీలు కూటమిగా మారుతాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయిదు రోజుల పాటు చర్చలు జరిగినా.. ప్రభుత్వ ఏర్పాటుపై ఎటువంటి నిర్ణయం వెలుబడలేదు. 1990 దశకంలో మలేసియా డిప్యూటీ ప్రధానిగా అన్వర్ చేశారు. అప్పట్లో మాజీ ప్రధాని మహతిర్ స్థానంలో అన్వర్ వస్తారని ఆశించారు.