నేడు అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ వద్ద సిబ్బంది నిరసన

-

హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది ధర్నా మూడోరోజుకు చేరింది. మూడ్రోజులుగా ఎల్బీ నగర్- మియాపూర్ కారిడార్లలో విధులకు హాజరుకాకుండా సిబ్బంది ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యోగులకు సంఘీభావంగా మిగతా కారిడార్లలోని టికెటింగ్ సిబ్బంది కూడా ధర్నాలో పాల్గొంటున్నారు. ఇవాళ అమీర్​పేట్ మెట్రో స్టేషన్ వద్ద టికెటింగ్ సిబ్బంది భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ ధర్నాలో దాదాపు 450 మంది సిబ్బంది పాల్గొననున్నారు.

తమ జీతాలు పెంచాలంటూ మంగళవారం రోజున ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్లలో సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఆయా స్టేషన్ల వద్ద మెట్రో టికెటింగ్‌ ఉద్యోగులు ధర్నాలకు దిగారు. గత కొంత కాలంగా తమకు సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నప్పుడు రిలీవర్‌ సరైన సమయానికి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం భోజనం చేయడానికీ సమయం ఇవ్వడం లేదని ఆక్షేపించారు. వేతనాలు పెంచే వరకు విధులకు హాజరుకాబోమని తేల్చిచెప్పారు.

సిబ్బంది మెరుపు ఆందోళనతో మెట్రో కియోలిస్ సబ్ ఏజెన్సీ నిర్వాహకులు వారితో.. అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌లో చర్చలు జరిపారు. చర్చలు విఫలమవ్వడంతో ఇవాళ మళ్లీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news