ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో తీవ్ర ఉధృక్తత నెలకొంది. క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ రామాపురానికి చెందిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ఒక వ్యక్తి అందరితో మంచిగానే ఉంటూ కొద్ది రోజులుగా పూజలు నిర్వహిస్తున్నాడని గ్రామస్తులు గమనించినా అంతలా పట్టించుకోలేదు. అయితే రాను రాను అతను చేస్తున్నది క్షుద్ర పూజలు అని తెలియగానే ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు.
అయితే అతడిని ఏమైనా అంటే కక్ష గట్టి ఏమైనా చేస్తాడేమోనని గ్రామస్తులు భయపడ్డారు. కానీ ఇలాగే వదిలేస్తే ప్రాణాలపై ముప్పు వస్తుందని తెగించిన గ్రామస్తులు అందరూ ఏకమై అతడు క్షుద్ర పూజలు చేస్తున్న చోటుకు వెళ్లి నిలదీశారు. దీంతో అతడు నేను చేస్తున్నది క్షుద్ర పూజలు అని చెప్పడంతో అగ్రహానికి గురైన గ్రామస్తులు అతడిని కట్టేసి దేహశుద్ధి చేశారు. అంతేకాకుండా పోలీసులు గ్రామంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. మాంత్రికుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది.