తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వికారాబాద్, హైదరాబాద్ అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలలో వడగండ్ల వాన కూడా కురిసింది. దీంతో చాలా జిల్లాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ రోజు లేదా రేపు వడగళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం శ్రీ కేసీఆర్. వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టం వివరాలను తెప్పించాలని సంబంధిత జిల్లా మంత్రులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, వ్యవసాయ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రిపోర్టుల పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకొని ఎక్కువ నష్టం వాటిల్లిన జిల్లాల పర్యటనకు బయలుదేరనున్నారు సీఎం కేసీఆర్.