పేపర్ లీకేజీ కేసు.. TSPSC ఛైర్మన్ వాంగ్మూలం రికార్డు చేసిన సిట్

-

TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను విచారించిన విషయం తెలిసిందే. అయితే కమిషన్ ఛైర్మన్‌కు కూడా నోటీసులు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీనికి తెరదింపుతూ సోమవారం రోజున సిట్ అధికారులే కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి కార్యాలయానికి వెళ్లారు.

ఛైర్మన్‌ ఛాంబర్‌లోనే దాదాపు మూడు-మూడున్నర గంటల పాటు జనార్దన్‌రెడ్డి నుంచి వారు పలు కీలక వివరాలు సేకరించినట్టు సమాచారం. నియామక ప్రక్రియలో ఓటీఆర్‌, నోటిఫికేషన్‌, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్ష కేంద్రాల కేటాయింపు, ప్రశ్నపత్రాల తరలింపు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, అర్హుల జాబితా రూపకల్పన, తుది ఫలితాల వెల్లడి.. ఇలా వివిధ దశల్లో కమిషన్‌ వ్యవహరించే తీరుపై అడిగారు.

కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌కు కస్టోడియన్‌(భద్రతా అధికారి)గా ఎవరుంటారు? బాధ్యత ఎవరిది? ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక నిర్వహణ లోపాలున్నాయా? గతేడాది అక్టోబరు నుంచే ప్రశ్నపత్రాలను కాజేసేందుకు ఉద్యోగులు చేస్తున్న యత్నాలను కమిషన్‌ పరిపాలన యంత్రాంగం ఎందుకు గుర్తించలేదు? మాస్టర్‌ ప్రశ్నపత్రాలు ఎవరి అధీనంలో ఉంటాయో ఆరా తీసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news