ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు మరోసారి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి ఏకంగా ఆ ఇద్దరిని చంపుతానంటూ ఓ అంగంతుకుడు బెదిరించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో ఉన్న ఓ మీడియా సంస్థకు ఈ మెయిల్ చేశాడు. ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రధానినే చంపుతామని బెదరింపులు రావడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు.
నోయిడాలోని ఓ ప్రైవేట్ మీడియా సంస్థ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు.. ఏప్రిల్ 3న రాత్రి 10:23 గంటలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తానని బెదిరించాడు. [email protected] అనే మెయిల్ ఐడీతో తమ కార్యాలయానికి సందేశం వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న వెంటనే.. రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నోయిడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రజనీశ్ వర్మ తెలిపారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం కావడం వల్ల.. కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. .