ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు నిర్వహిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో వాడవాడనా బీఆర్‌ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్ నినాదాలతో పట్టణాలు, పల్లెలు మారుమోగుతున్నాయి.
తెలంగాణలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందిస్తూ ఎనిమిదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, జెండా ఆవిష్కరించారు. ఎ
నిమిది ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని మంత్రి ఇంద్ర కరణ్ అన్నారు. ఈ నెల 27న హైద్రాబాద్‌లో ప్లీనరీ సమావేశం ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.