నగదు నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపిన విషయం తెలిసిందే. నిర్దేశిత గడువు అయిన సెప్టెంబర్ 30లోపు రూ.2వేల నోట్లు అన్నీ వెనక్కు వచ్చేస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ్టి నుంచి బ్యాంకుల్లో రూ.2వేల నోట్లను మార్పిడి చేసుకోవచ్చని సూచించారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను బ్యాంకు అధికారులు పూర్తి చేశారని చెప్పారు. ఈ నోట్ల చట్టబద్ధత మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రూ.2వేల నోట్ల డిపాజిట్ సమయంలో రూ. 50వేలు మించితే పాన్ కార్డు తప్పనిసరి అని శక్తికాంతదాస్ వివరించారు. రూ.2వేల నోట్ల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో కొరతను అధిగమించేందుకే రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టినట్లు ఆయన వ్యాఖ్యానించారు. పలు దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, కొన్ని అమెరికా బ్యాంకులు సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ.. భారత కరెన్సీ నిర్వహణ వ్యవస్థ చాలా సమర్థంగా ఉందని పేర్కొన్నారు.