కాళేశ్వరానికి ‘ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రెస్‌’ పురస్కారం

-

కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్‌ నగరంలో ‘అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రపంచ పర్యావరణ, జల వనరుల సదస్సు’లో మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో నీటి కరవు.. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అతి తక్కువ సమయంలో కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసిన విధానాన్ని దృశ్యరూపంలో కేటీఆర్‌ ఆవిష్కరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ‘ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రెస్‌’ పురస్కారాన్ని ప్రకటించగా.. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ ప్రెసిడెంట్‌ మరియా సి లెహ్‌మన్‌ చేతుల మీదుగా దాన్ని మంత్రి కేటీఆర్‌ స్వీకరించారు.

‘‘తెలంగాణలో చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి 2017లో ఇదే ప్రపంచ జలవనరుల సదస్సులో వివరించే అవకాశం దక్కింది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సమావేశం.. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు పురస్కారం అందించడం రాష్ట్రానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేధస్సుకు దక్కిన ఒక అపూర్వ గుర్తింపు. ఒక నాయకుడు తలుచుకుంటే సాధించేగలిగే ఒక గొప్ప విజయానికి నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు.” అని కేటీఆర్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news