దక్షిణ కొరియా చాలా ఏళ్ల నుంచి పౌరుల వయసు నిర్ధారించేందుకు వివిధ రకాల విధానాలు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానాల వల్ల అక్కడి పౌరులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే.. పౌరుల వయసును నిర్ధారించేందుకు భిన్న విధానాలు ఉపయోగిస్తున్న దక్షిణ కొరియా ఇప్పటి నుంచి అంతర్జాతీయ విధానాన్ని అవలంభించాలని నిర్ణయించింది. దీంతో ప్రతీ దక్షిణకొరియా పౌరుడి వయసు ఒకటి నుంచి రెండేళ్లు తగ్గనుంది.
కొరియాలో 3 విధానాలుగా పౌరుల వయసు నిర్ణయిస్తారు. ఒకటి అంతర్జాతీయ విధానం అంటే పుట్టినప్పుడు వయసు సున్నాగా ఉంటే.. ఆ తర్వాతి సంవత్సరం అదే తేదీకి ఒక ఏడాది వయసు పూర్తవుతుంది. కొరియన్ విధానంలో శిశువు పుట్టిన వెంటనే బిడ్డ వయసు ఏడాదిగా నిర్ణయిస్తారు. తర్వాత ప్రతీ జనవరి 1న వయసును పెంచుతూ వెళ్తారు. క్యాలెండర్ విధానం ప్రకారం.. పుట్టినప్పుడు బిడ్డ వయసు సున్నాగా ఉంటే ప్రతీ జనవరి 1న ఒక్కో ఏడాదిని పెంచుతుంటారు. ఇదంతా తీవ్ర గందరగోళానికి కారణం అవుతుండటంతో అక్కడి పార్లమెంటు.. ఇవాళ్టి నుంచి అంతర్జాతీయ విధానం ప్రకారమే వయసు నిర్ధరణ ఉంటుందని ప్రకటించింది.