నేపాల్ ప్రధాన మంత్రి పుష్పకుమార్ దహల్ ప్రచండ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో దుమారం రేపుతున్నాయి. నేపాల్లో స్థిరపడిన ఓ భారత వ్యాపారి తనను ప్రధానిని చేసేందుకు గతంలో సాయం చేశారంటూ ప్రచండ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అక్కడ సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రచండ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.
కాఠ్మాండూలో నివసిస్తున్న ప్రముఖ భారత వ్యాపారవేత్త సర్దార్ ప్రీతమ్సింగ్ జీవితకథపై రచించిన ‘రోడ్స్ టు ది వ్యాలీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం గత సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని ప్రచండ మాట్లాడుతూ.. ‘‘నేపాల్ – భారత్ బంధాన్ని బలోపేతం చేయడంలో సర్దార్ ప్రీతమ్సింగ్ ముఖ్యపాత్ర పోషించారు. ఆయన ఓ సందర్భంలో నన్ను ప్రధానిగా చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. నా కోసం అనేకసార్లు దిల్లీ వెళ్లారు. కాఠ్మాండూలోని రాజకీయ నేతలతో పలుమార్లు చర్చలు జరిపారు’’ అన్నారు. ఈ వ్యాఖ్యలు నేపాల్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.