‘పాలమూరు’కు పర్యావరణ అనుమతి నిరాకరణ..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

-

కేంద్ర సర్కార్​పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల రెండో దశకు పర్యావరణ అనుమతి అంశాన్ని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ పక్కన పెట్టిన నేపథ్యంలో కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షపూరిత వైఖరిని అనుసరిస్తోందని ధ్వజమెత్తారు.

‘‘తొమ్మిదేళ్లయినా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా డిమాండ్‌ను తేల్చకుండా తాత్సారం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో, ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్రం తీవ్రమైన వివక్షతో వ్యవహరిస్తోంది. ఈ ప్రాజెక్టుకు రెండో దశ పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా పక్కనబెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కరవు పీడిత ప్రాంతాలైన నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ఈ ప్రాజెక్టు ఆశాకిరణం. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు సహా పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం శోచనీయం.” అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news