బాబోయ్ ఉల్లి… సెంచరీ దాటేస్తుందా…? వంటింట్లో జాగ్రత్త…!

-

ఉల్లిపాయ” ఇప్పుడు ఈ పేరు వింటే చాలు వంటిల్లు… కన్నీరు పెడుతుంది. నాలుగు కోసే వాళ్ళు ఒకటితో సరిపెడుతున్నారు. ఒకటి వాడే వాళ్ళు సగం ముక్క కోసి సగం ఫ్రిడ్జ్ లో పెట్టుకునే పరిస్థితి ఉంది. ఉల్లి ఘాటు దెబ్బ గత రెండు నెలల నుంచి గట్టిగానే తగులుతుంది. దేశంలో ఎక్కువగా ఉల్లి వినియోగం ఉండే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడు ఆ రాష్ట్రాలే బాబోయ్ ఉల్లి అంటున్నాయి. గత కొన్నిరోజులుగా రిటైల్‌ మార్కెట్‌లో కిలోకు 40 నుంచి 50 రూపాయలు పలకడంతో వినియోగదారులు ఆచితూచి కొంటున్నారు.

దీనికి కారణం మహారాష్ట్రలో భారీ వర్షాలు పడటమే. ఎడతెరపి లేని వర్షాలతో మహారాష్ట్రలో ఉల్లి పంట భారీగా దెబ్బ తిన్న నేపధ్యంలో… తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు చెట్టెక్కి కూర్చున్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా మహారాష్ట్ర నుంచే ఉల్లి ఎగుమతి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. 80శాతం మహారాష్ట్ర నుంచే దిగుమతి అవుతుంది. సాధారణ రోజుల్లో రోజుకు 150 నుంచి 200 లారీల వరకు హైదరాబాద్ మార్కెట్ కి వస్తుంది. ఇప్పుడు ఉల్లి కొరత తీవ్రంగా ఉన్న నేపధ్యంలో కొన్ని రోజులుగా రోజులుగా 50 నుంచి 60 లారీలు కూడా రావడం లేదట.

ఇక ఈ వారం ఉల్లి ధర హైదరాబాద్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటాల్‌కు 5,700 రూపాయలు పలికింది. దీనితో రిటైల్ మార్కెట్ లో ఉల్లిధర 80 నుంచి 90 వరకు పలికే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు దీనిని ఆసరాగా చేసుకుని కొందరు రాజకీయ నాయకులు జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేట్ గోదాన్ లో భారీగా ఉల్లిని నిలువ చేసిన రాజకీయ నాయకులు మార్కెట్ కి సరఫరా చేయడంతో పాటు చిన్న చిన్న వ్యాపారులకు కూడా అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారట. దీనిలో కొందరు మంత్రుల హస్తం కూడా ఉందనే ప్రచారం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news