తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం త్వరలోనే మోగనుంది. ఎన్నికల నగారాను మోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఎన్నికలకు ముహూర్తాన్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేపట్టిన ఈసీ.. అక్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్‌ను ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఎన్నికల సన్నద్ధతపై అధ్యయనం చేసేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం రాష్ట్రానికి రానుంది. అక్టోబరు మొదటి వారంలో వచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఇదే గడువు. మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం ఈ ఏడాది డిసెంబరు 17తో ముగియనుంది. తెలంగాణతోపాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే దఫా షెడ్యూలును ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే ఎన్నికల సంఘంలోని ఉన్నతస్థాయి అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల సన్నద్ధత తొలిదశను పరిశీలించింది. మరోపక్క ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోంది.