80 శాతం మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ అనే సంస్థ తెలిపింది. వీరిలో 55 శాతం మంది మోదీపై అత్యంత సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. ఐదో వంతు మంది మాత్రమే మోదీకి వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొంది.
పది మంది భారతీయుల్లో ఏడుగురు ప్రపంచంలో భారత్ ప్రబల శక్తిగా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారని ఈ సర్వే వెల్లడించింది. 2022 సర్వేలో ఇది 28 శాతం మాత్రమేనని.. 24 దేశాలలో 30 వేల 861 మందిని సర్వే చేసినట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 46 శాతం మంది భారత్‌పై సానుకూలంగా ఉన్నారని ప్యూ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
ఇటీవలి కాలంలో అమెరికా ప్రభావం మరింత బలపడుతోందని 49 శాతం భారతీయులు చెప్పగా, 41 శాతం మంది రష్యా ప్రభావం పెరుగుతోందని చెప్పారు. ప్రధాని మోదీ ప్రజాదరణ ఏమాత్రం చెక్కుచెదరలేదని ప్యూ సంస్థ నివేదికను ఉటంకిస్తూ బీజేపీ ట్వీట్ చేసింది.