హైదర్ గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ఉన్న వై జంక్షన్ వద్ద రన్నింగ్ లో ఉన్న ఆటోపై భారీ వృక్షం కూలింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహమ్మద్ గౌస్ పాషా రాజ్ భవన్ రోడ్డు లోని ఎమ్మెస్ మక్తా వాసిగా గుర్తించారు. ఇతను ర్యాపిడో ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శనివారం హిమాయత్ నగర్ నుంచి బషీర్ బాగ్ వైపు ఆటోలో ఒక్కడే వెళ్తున్నాడు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో అక్కడే ఆటోను ఆపాడు.
ఈ నేపథ్యంలో పుట్ పాత్ పై ఉన్న భారీ వృక్షం అకస్మాత్తుగా కూలి నేరుగా ఆటోపై పడింది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్ మహమద్ గౌస్ అక్కడికక్కడే ప్రాణాలను విడిచాడు. ఇతని ముందు ఉన్న మరో ఆటో పూర్తిగా ధ్వంసం అయింది. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందం భారీ వృక్షాన్ని తొలగించారు. హిమాయత్ నగర్ డివిజన్ లో దాదాపు 20 చెట్ల వరకు కూలిపోయే స్టేజీలో ఉన్నాయని.. రెండేళ్లుగా హార్టికల్చర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మీ పేర్కొనడం గమనార్హం.