తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. కేసీఆర్ను గద్దె దించాలనుకుంటున్న బీజేపీ ప్రయత్నాలకు దీటుగా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలనే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల కోసం దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తైంది.
ఇప్పటికే పలువురు కీలక నేతలు కూడా వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రచారకమిటీ ఛైర్మన్ మధు యాస్కీ ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేశారు. అయితే తాజాగా మధు యాస్కీకి వ్యతిరేకంగా గాంధీ భవన్ వద్ద పోస్టర్లు వెలవడం కలకలం సృష్టించింది.
సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్, గో బ్యాక్ టు నిజామాబాద్ నినాదాలు కనిపించాయి. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పోస్టర్లలో ప్రచురించారు. కాంగ్రెస్‌లో టికెట్ల ఖరారు చేసేందుకు పీసీసీ ముమ్మర కసరత్తు చేస్తున్న వేళ మధు యాస్కీకి వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలియడం కలకలం రేపుతోంది.