రుణం చెల్లించిన 30 రోజుల్లోగా ఆస్తి పత్రాలు వెనక్కి ఇవ్వండి.. బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

-

బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణాలను పూర్తిగా చెల్లించిన తర్వాత 30 రోజుల్లోగా రుణగ్రహీతలకు అసలైన ఆస్తి పత్రాలను వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఈ నిబంధనలను పాటించకపోతే, రుణగ్రహీతకు రోజుకు రూ.5,000 చొప్పున పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు 2023 డిసెంబరు 1 నుంచి అమలు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

డిసెంబర్ 1 లేదా తర్వాత ఆస్తి పత్రాలను విడుదల చేయాల్సిన అన్ని సందర్భాల్లోనూ ఈ నిబంధనలను పాటించాలని ఆర్​బీఐ తెలిపింది.  ఆస్తులను పూచీకత్తుగా పెట్టి తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించిన తర్వాత కూడా కొన్ని ఆర్థిక సంస్థలు ఆ దస్తావేజులను విడుదల చేసే విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఆర్‌బీఐ ఈ మేరకు సర్క్యులర్‌ జారీచేసింది.

‘ఖాతాదారు తన రుణాన్ని పూర్తిగా చెల్లించిన 30 రోజుల్లోపు వారికి సంబంధించిన ఒరిజినల్‌ స్థిర/చరాస్తుల దస్తావేజులు ఎక్కడ తీసుకోవాలన్న విషయాన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు రుణగ్రహీతకు స్పష్టంగా చెప్పాలి. రుణం ఇచ్చిన బ్యాంకు బ్రాంచిలోనా, లేదంటే ఇతరత్రా ఏదైనా ఆఫీసులోనా రుణగ్రహీత ఎంచుకున్న చోట వాటిని తిరిగి ఇచ్చేయాలి. ఖాతాదారుడు పూచీకత్తుగా ఉంచిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లకు పూర్తిగాకానీ, పాక్షికంగాకానీ నష్టం జరిగితే వాటి డూప్లికేట్‌/సర్టిఫైడ్‌ కాపీలను పొందేందుకు రుణదాత సహకరించడంతోపాటు, అందుకు అయ్యే ఖర్చులన్నీ భరించాలి.’ అని ఆర్​బీఐ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news