ప్రఖ్యాత లండన్ ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ మేగజైన్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (ఇంగ్లాండ్) మొదటి స్థానం దక్కించుకుంది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం (కాలిఫోర్నియా), మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కేంబ్రిడ్జి, మసాచుసెట్స్) వరసగా రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచాయి. ఈ ర్యాంకుల్లో రికార్డు స్థాయిలో 91 భారతీయ వర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. గతసారి 75 భారతీయ యూనివర్సిటీలకు చోటు లభించగా ఈసారి 91కి పెరిగింది.
మన దేశంలోని అగ్రశ్రేణి ఐఐటీలు వరసగా నాలుగో ఏడాది ఈ ర్యాంకుల్ని బహిష్కరించాయి. నాలుగో ఉత్తమ దేశంగా భారత్ నిలిచింది. గతసారి ఆరోస్థానంలో ఉండేది. ముఖ్యంగా బెంగళూరులోని ప్రఖ్యాత ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (ఐఐఎస్‌సీ) 2017 తర్వాత మరోసారి ప్రపంచంలో 250వ స్థానంలో నిలిచింది. అన్నా విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు, స్కూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్.. ఈ నాలుగూ 510-600 ర్యాంకుల మధ్య నిలిచాయి. 108 దేశాల్లోని 1,904 విశ్వవిద్యాలయాలు ఈసారి ర్యాంకింగ్‌లో పాల్గొన్నాయి.