ఎన్నికల్లో ప్రలోభాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్

-

హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లతో పాటు ప్రలోభాల పర్వంపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో డబ్బు, మద్యం, విలువైన కానుకల పర్వానికి అడ్డుకట్టవేసేలా తీసుకోవాల్సిన పటిష్ఠ చర్యలు, అమలు చేయాల్సిన కార్యాచరణపై ఆరా తీస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశంలో ప్రలోభాల అంశాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించింది.

దక్షిణాదిలో… ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యయం భారీగా అవుతోందని, ప్రలోభాల పర్వం కూడా ఎక్కువగా ఉంటోందని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికలు, మునుగోడు ఉపఎన్నిక సహా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది. ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాల విషయంలో మరింతగా శ్రద్ధ కనబరచాలని సూచించింది. డబ్బు, మద్యం తదితరాలను అడ్డుకునేలా నియోజకవర్గ స్థాయిలో  పటిష్ట కార్యాచరణ చేపట్టాలని… అధికారులు ఇంకా బాగా పనిచేయాలని ఈసీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్ట్‌ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సాధించాలని తెలిపింది.

శాసనసభ ఎన్నికల కోసం చేస్తున్న ఏర్పాట్లు, ఎన్నికల ప్రణాళికలు, ఇతరత్రా అంశాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వివరించారు. ప్రలోభాల పర్వానికి అడ్డుకట్టవేసేలా జిల్లా స్థాయిలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సమన్వయంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోసం శాంతిభద్రతలు, రక్షణ సంబంధిత అంశాలు, ఏర్పాట్లు, వాటి వివరాలను రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి, కేంద్ర పోలీస్ బలగాల నోడల్ అధికారి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news