బిహార్‌లో ఇటీవల నితీశ్ కుమార్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కుల గణనపై తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుల గణన సర్వే వివరాలను ప్రచురించాల్సిన అవసరం ఏం వచ్చిందని నితీశ్ సర్కార్ను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు ఈ వివరాలు ప్రచురించకుండా ఉండేందుకు ప్రభుత్వానికి తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది.
కులగణన సర్వే వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘిస్తోందని, దీనిపై స్టే విధించాలంటూ.. కులగణన కోసం బిహార్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఏక్ సోచ్ ఏక్ పర్యాస్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు నలందాకు చెందిన అఖిలేష్ కుమార్ సహా పలువురు దాఖలు చేసిన పిటిషిన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషనర్ల అభ్యర్థనలను తోసిపుచ్చింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడం సరికాదని.. విధాన నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించడం తప్పు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా కులగణన డేటాను ఎందుకు ప్రచురించాల్సి వచ్చింది? అని నితీశ్ సర్కార్ను ప్రశ్నించింది. విధాన రూపకల్పనకు కులగణన డేటా ఎంత అవసరమో పట్నా హైకోర్టు ఉత్తర్వుల్లో సవివరంగా స్పష్టం చేసిందని జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్లకు తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను 2024 జనవరికి జాబితా చేసింది.