కర్ణాటక ఫలితాలతో జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ ఫలితాలు తెలంగాణలో రిపీట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. మరోవైపు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తోంది. మరో వారంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు.
తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ లో ఆందోళనకు దిగారు. కోదాడ అభ్యర్ధిగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి వద్దంటూ నినాదాలు చేశారు. ఆమె స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరని…తమ బాధలను పట్టించుకోరని ఆరోపించారు. ప్రజల్లో ఉంటూ…. తమ సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించే వ్యక్తి టికెట్ ఇవ్వాలని కర్యకర్తలు కోరారు.
మరోవైపు ఆదిలాబాద్లో కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ గాంధీభవన్లో ఆందోళన చేశారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వదంటూ ఆదిలాబాద్ నియోజక వర్గానికి చెందిన మైనారిటీ నాయకుల ఆందోళనకు దిగారు.