ఇజ్రాయెల్‌లో హమాస్ మారణ కాండ సృష్టిస్తోంది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులతో పాటు ఆ దేశానికి వచ్చిన విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌లో జరుగుతున్న ఓ మ్యూజిక్ ఫెస్టివల్లో హమాస్ నరమేధం సృష్టించింది. ఒక్కసారిగా ఆకాశంలో నుంచి రాకెట్లు దూసుకురావడంతో అప్పటి వరకు సంగీతాన్ని ఆస్వాదిస్తున్న ప్రజలకు అక్కడేం జరుగుతుందో అర్థంకాలేదు. క్షణాల్లోనే రక్తపాతం.. హాాహకారాలతో ఆ ప్రాంతమంతా భీకరంగా మారిపోయింది.
ఓవైపు ఆకాశం నుంచి రాకెట్ల వర్షం మరోవైపు డజన్ల కొద్దీ సాయుధ ముష్కరుల కాల్పుల మోతతో మృత్యుకేళి నాట్యమాడింది. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్న ప్రజలను.. ఎమర్జెన్సీ ద్వారాల వద్ద కూడా ముష్కరులు నక్కినక్కి మరీ మట్టుబెట్టారు. ఇజ్రాయెల్ పై హమాస్ ముష్కరులు జరిపిన దాడుల్లో ఇప్పటి వరుక 700 మందికి పైగా చనిపోగా.. అందులో 260 మంది మృతదేహాలు ఒక్క మ్యూజిక్ ఫెస్టివల్‌లోనే లభ్యమయ్యాయి.
ఇజ్రాయెల్(లో వ్యవసాయ పండుగ, యూదులు ఈజిప్ట్ నుంచి వలస రావడాన్ని స్మరించుకునే సందర్భాలు కలిసిరావడంతో ఇజ్రాయెల్-గాజా సరిహద్దు సమీపంలో నెగెవ్ ఎడారిలో కిబ్బట్జ్ రీమ్ సమీపంలోని ఓ విశాల ప్రాంగణంలో ‘ట్రైబ్ ఆఫ్ నోవా’ కంపెనీ ‘ది సూపర్ నోవా’ పేరిట మ్యూజిక్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి సుమారు 3,000 మంది హాజరవ్వగా ముష్కరుల చేతుల్లో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది తీవ్రంగా గాయపడ్డారు.