రోజురోజుకు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కూడా పెరిగి వాతావరణ పరిస్థితుల్లో సమతుల్యత తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో పరిస్థితులు ఏప్రిల్, 2024 వరకు కొనసాగుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తెలిపింది. భూ ఉపరితలం, సముద్ర జలాలపై ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని వెల్లడించింది.
జులై-ఆగస్టులో ఎల్నినో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయని డబ్ల్యూఎంఓ అధికారులు తెలిపారు. నవంబర్లో బలంగా మారి, జనవరి 2024 నాటికి ఎల్నినో అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. ఉత్తరార్థ గోళంలో శీతాకాలంలో, దక్షిణార్థ గోళంలో వేసవికాలంలో ఎల్నినో పరిస్థితులు కొనసాగే అవకాశం 90 శాతం వరకు ఉన్నాయని వెల్లడించారు.
ఎల్నినో ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలపై ఉంటుందని డబ్ల్యూఎంవో వెల్లడించింది. అత్యంత వేడి సంవత్సరంగా 2023 రికార్డ్ సృష్టించగా.. 2024లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగి ఈ రికార్డును బ్రేక్ చేస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు, కరవు పరిస్థితులు, అడవుల్లో కార్చిచ్చు, హఠాత్తుగా కుండపోత వర్షాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉందని తెలిపారు.