చైనాకు మరో షాక్ తగిలింది. డ్రాగన్ దేశానికి చెందిన సోషల్ మీడియా నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ మరో దేశంలో నిషేధానికి గురైంది. భారత్ బాటలో పయనిస్తూ పొరుగు దేశం నేపాల్ టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించింది. ఈ యాప్ వల్ల తమ దేశంలోని సామరస్యం దెబ్బ తింటోందని.. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ తెలిపారు.
గత నాలుగేళ్లుగా 1600కు పైగా సైబర్ క్రైమ్ కేసులు ఈ యాప్‌పై నమోదైనట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో నేపాల్ సైబర్ బ్యూరో పోలీసులు, హోం శాఖతో టిక్‌టాక్ ప్రతినిధులు వారం క్రితం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది. మరోవైపు ఎక్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు తమ అనుబంధ కార్యాలయాలను నేపాల్‌ల్లో ఏర్పాటు చేయాలని ఆ దేశ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయించినట్లు రేఖా శర్మ వెల్లడించారు.
టిక్‌టాక్ నిషేధంపై ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార నేపాలీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గగన్ తాపా తప్పుబడుతూ… నిషేధానికి బదులు నియంత్రణ చేపట్టాల్సిందని అన్నారు. ఇప్పటికే టిక్‌టాక్‌పై భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే దేశాల్లో బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నేపాల్ కూడా చేరింది.