ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో తిరగడం మాని రోడ్లపై ప్రయాణం చేస్తే… గతుకులమయమైన రోడ్లతో ప్రజలు పడుతున్న అవస్థలు ఆయనకు కూడా తెలుస్తాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. రాష్ట్రంలో రహదారులన్నీ అధ్వానంగా ఉన్నాయని, ఉభయగోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ రోడ్లన్నీ గతుకుల మయంగా మారాయని, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి పట్టే సమయం నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగిందని ఆయన అన్నారు.
జగనన్న రాజ్యంలో ప్రజలు చాలా దరిద్రాన్ని, దుర్భిక్షాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి పట్టే సమయం నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగితే, అదనంగా ఖర్చయ్యే పెట్రోల్, డీజిల్ భారాన్ని వాహనదారులు మోయలేకపోతున్నారని అన్నారు. జగనన్న మద్యం దెబ్బకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు బాగున్నారని తాను సోమవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో చెబితే, ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి… కేవలం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు మాత్రమే కాదు, ఇంకా కొన్ని రంగాలకు చెందిన వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారని తెలిపారు.