తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. రెండ్రోజుల పాటు ప్రియాంక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తిలో, 1.30 గంటలకు హుస్నాబాద్, సాయంత్రం 3 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలలో ఆమె పాల్గొంటారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్ధి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా కూడా ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తారు. రాత్రికి ఖమ్మంలో బస చేస్తారు.
25వ తేదీన ఉదయం 11 గంటలకు పాలేరు, 1.30 గంటలకు సత్తుపల్లి, 2.40 గంటలకు మధిర ప్రచార సభలలో ప్రియాంక పాల్గొంటారు. ఆ తరువాత అక్కడి నుంచి విజయవాడకు చేరుకొని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి దిల్లీకి బయల్దేరతారు. ఈ నెల 27వ తేదీన మరోసారి రాష్ట్రానికి ప్రియాంక గాంధీ రానున్నారు. అనంతరం రెండ్రోజుల పాటు ప్రచారంలో పాల్గొంటారు.
మరోవైపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇవాళ, రేపు రెండు రోజులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన బెంగుళూరు నుంచి ఈ ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గంలో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. అక్కడ నుంచి వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొంటారు. రాత్రికి అంబర్ పేట నియోజక వర్గం కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. 25న హైదరాబాద్‌లోని పలు నియోజక వర్గాలలో రోడ్ షోలు, కార్నర్ సమావేశాలు నిర్వహించనున్నారు.