తెలంగాణ వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం పోలింగ్ జరిగితే.. హైదరాబాద్‌లో మాత్రం 55 శాతానికి మించడం లేదు. అయితే నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు ర్యాపిడో సంస్థ కూడా ఓ ఉపాయం ఆలోచించింది. అందుకోసం పోలింగ్ డే స్పెషల్ ప్రోగ్రామ్ రూపొందించింది. ఇందులో భాగంగా ఫ్రీ రైడ్ షేరింగ్‌ను చేపట్టింది.
ఇవాళ హైదరాబాద్ నగరవ్యాప్తంగా 2,600 పోలింగ్ బూత్‌లకు ఉచిత రైడ్లను అందిస్తూ.. రైడ్ షేరింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ వినూత్న పోగ్రాంకు సిద్ధమైనట్లు ఈ సంస్థ వెల్లడించింది. ర్యాపిడో కెప్టెన్లంతా ఇవాళ ఉదయం నుంచే రైడ్లకు సిద్ధంగా ఉన్నారు. ఓటు వేయాలనుకునే ఓటర్లు ర్యాపిడో యాప్‌లో రైడ్ కోరిన వెంటనే వారిని పోలింగ్ బూత్‌ల వద్దకు ఉచితంగా బైక్ మీద తీసుకువెళ్తారు. ఇంకెందుకు ఆలస్యం మరి మీరూ ర్యాపిడో ఫ్రీ రైడ్ బుక్ చేసి ఓటు హక్కు వినియోగించుకోండి.
ర్యాపిడో ఫ్రీ రైడ్ ఎలా బుక్ చేయాలంటే..
- ముందుగా ర్యాపిడో బైక్ ట్యాక్సీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- యాప్ లాగిన్ అయిన తర్వాత ఉచిత రైడ్ సేవలపై వివరాలు ప్రత్యక్షమవుతాయి.
- ఉచిత రైడ్ సేవలలో పోలింగ్ బూత్ ఎక్కడుందో టైప్ చేయాలి.
- అనంతరం కూపన్ కోడ్ వస్తుంది.
- కూపన్ కోడ్ ఉన్న చోట వోట్ నౌ అనే వన్ టైమ్ కోడ్‌ను నమోదు చేయాలి అంతే మీ రైడ్ బుక్కయినట్లే.