పదుల సంఖ్య అత్యాచార కేసుల్లో నిందితుడిగా మారి భారత్ నుంచి పారిపోయిన వివాదాస్పద స్వామీ నిత్యానంద ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. నిత్యానంద ఊహాజనిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో చేసుకున్న డీల్ ఓ అధికారి ఉద్యోగం ఉఫ్మనిపించింది. కైలాస ప్రతినిధులతో అవగాహనా ఒప్పందం చేసుకున్న పరాగ్వే వ్యవసాయశాఖ అధికారి తన ఉద్యోగాన్ని కోల్పోయారు. మరోవైపు దక్షిణ అమెరికాలోని పలువురు ప్రభుత్వాధికారులను నిత్యానంద తప్పుదోవపట్టించినట్లు సమాచారం. ఇలా ఈ వివాదాస్పద స్వామీ పలు దేశాలకు తలనొప్పిగా మారుతున్నాడు.
ఈ ఏడాది మొదట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐరాస సమావేశాల్లో పాల్గొనగా.. ఈ భేటీలో పాల్గొన్న పరాగ్వే వ్యవసాయ శాఖ కీలక అధికారి.. కైలాసతో దౌత్యసంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తానని.. అంతర్జాతీయ వేదికలపై కైలాస దేశ సార్వభౌమత్వానికి గుర్తింపు లభించేలా మద్దతు ప్రకటిస్తూ ఓ ప్రకటనపై సంతకం చేశారు. అయితే దీనిపై పరాగ్వేలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇదో పెద్ద స్కామ్ అని ఆరోపిస్తూ పరాగ్వే నెటిజన్లు నెట్టింట హల్చల్ సృష్టించారు. ఈ నేపథ్యంలో స్పందించిన సదరు అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తనకు కైలాస దేశం ఎక్కడుందో తెలీదనీ.. నీటిపారుదల సహా ఇతర సమస్యల్లో సాయం చేస్తామని నిత్యానంద ప్రతినిధులు చెప్పడం వల్లనే పత్రంపై సంతకం చేశానని ఆయన మీడియాకు వివరించారు.