మరో 24 గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి రాష్ట్రంలో అధికారం ఎవరికి చేజిక్కుతుందోనని పార్టీలతో పాటు ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు టఫ్ పోటీ ఇవ్వడంతో ఈ ఫలితాలపై మరింత ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ ఉంది. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండటమే కాదు.. ఆయణ్ను ఓడించడానికి రేవంత్ రెడ్డి, ఈటల కూడా బరిలోకి దిగారు.
కామారెడ్డి ప్రజల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం అవతల కామారెడ్డి ఫలితంపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. స్థానికంగా, నియోజకవర్గం బయట లక్షల్లో పందెం కాస్తున్నారు. ఇక్కడి ఫలితంపై రాష్ట్రంలో పలు నగరాల్లో పందేలు కాయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్‌దే గెలుపంటూ కొందరు.. లేదు రేవంత్ గెలుపు ఖాయమంటూ మరికొందరు లక్షల్లో బెట్ కాస్తున్నారు. విజయం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు అవిశ్రాంతంగా శ్రమించిన నేపథ్యంలో గెలిచేదెవరనేది నిఘా వర్గాల అంచనాలకు కూడా అందని పరిస్థితి నెలకొంది.