తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో చేదు ఫలితాలను చూసింది. గతంలో ఎన్నడూ లేనంతగా చాలా తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం ఓటమికి గల కారణాలను ఈ పార్టీ విశ్లేషించుకుంటోంది. అలాగే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పందించారు.
ఇవాళ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిద్దామని వారితో చెప్పినట్లు సమాచారం. అలాగే కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కొత్త సర్కార్ ఎలాంటి మార్పు తీసుకువస్తుందో.. ఆ ప్రభుత్వం విధివిధానాలేంటో.. అసలు ఏమి జరుగుతుందో వేచి చూద్దామని ఎమ్మెల్యేలతో అన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం త్వరలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి.. శాసనసభాపక్ష నేతను త్వరలో ఎన్నుకుందామని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నారని తెలిసింది.