మేడిగడ్డ ఘటనలో ట్విస్ట్.. ఏడాదిన్నర కిందటే ముప్పు గుర్తింపు?

-

మేడిగడ్డ బ్యారేజీ ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ బ్యారేజీ దిగువ భాగంలో, అక్టోబరులో దెబ్బతిన్న పియర్స్‌ ప్రాంతంలో నీటి బుడగలు ఏర్పడినట్లు గతేడాదిలోనే ప్రాజెక్టు ఇంజినీర్లు గుర్తించారట. ఈ విషయాన్ని గుత్తేదారు సంస్థ అయిన ఎల్‌అండ్‌టీకి లేఖల ద్వారా తెలిపినా స్పందించలేదని సమాచారం.

బ్యారేజీ ఏడో బ్లాకులో 17, 18, 19, 20 తూముల (వెంట్స్‌)కు దిగువన బాయిలింగ్‌ ఆఫ్‌ వాటర్‌ (నీటి బుడగలు ఏర్పడి ఇసుక తన స్వభావాన్ని కోల్పోవడం) ఏర్పడిందని గతేడాది ఏప్రిల్‌లో నీటిపారుదలశాఖ ఇంజినీర్లు ఎల్‌అండ్‌టికి లేఖ రాశారు. దీని నివారణకు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దిగువ భాగంలోనే సిమెంటు కాంక్రీటు బ్లాక్స్‌ పక్కకు జరిగాయని తెలిపారు.

ఈ లేఖ రాసే సమయానికి డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ (డీఎల్‌పీ- నిర్వహణతోపాటు ఏం నష్టం వాటిల్లినా కాంట్రాక్టు ఏజెన్సీ బాధ్యతవహించే కాలం) ఉంది. అయినా ఎల్ అండ్ టీ ఈ లేఖకు స్పందించలేదు. ఎప్పటికప్పుడు కిందిస్థాయి ఇంజినీర్లు పెండింగ్‌లో ఉన్న, పునరుద్ధరించాల్సిన పనుల గురించి నివేదించినా ఫలితం లేదని స్పష్టమవుతోంది. అప్పుడే స్పందించి ఉంటే గత అక్టోబరులో బ్యారేజీకి భారీ నష్టం వాటిల్లేది కాదని నీటిపారుదలశాఖ సీనియర్‌ ఇంజినీర్లు అభిప్రాయ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news