తెలంగాణలో సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలు 4,436 ఉన్నాయని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. సొంత భవనాలు లేని పంచాయతీల జాబితాలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్లో మొదటి స్థానంలో బిహార్ (6,606), రెండో స్థానంలో పంజాబ్ (4,907) ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉన్నట్లు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 35,439 పంచాయతీలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. అందులో తెలంగాణ వాటా 12.51% ఉన్నట్లు వెల్లడించారు. పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, వాటికి సొంత భవనాలు నిర్మించి ఇవ్వాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు.
తాజాగా సవరించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకాన్ని 2022-23 నుంచి 2025-26 మధ్యకాలంలో అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద పంచాయతీ భవనాల నిర్మాణాలకు పరిమిత మొత్తంలో సాయం అందిస్తున్నామని పిల్ మోరేశ్వర్ పాటిల్ చెప్పారు.