తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేసింది. శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు రూ.62,461 కోట్లు అని.. 31 అక్టోబర్ 2023 నాటికి రూ. 81,516 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు.
దీనిపై బీఆర్ఎస్ తరఫున మాజీ విద్యుత్ శాఖ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని చెప్పారు. తమ పాలనలో విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామని తెలిపారు. 2014 జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తులు రూ.44,434 కోట్లు ఉండగా 2014 జూన్ 2 నాటికి రూ.22,423 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ రంగ ఆస్తులు రూ.1,37,570 కోట్లు అని, ప్రస్తుతం రూ. 81,516 కోట్ల అప్పులున్నాయని అని జగదీశ్ రెడ్డి చెప్పారు.
మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం హయాంలో అర ఎకరం కూడా ఎండలేదని స్పష్టం చేశారు. విద్యుత్‌పై ధర్నాలు చేసే అవకాశం ఇవ్వలేదని చెప్పారు.