పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం రోజున నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈనెల 14వ తేదీ ప్రారంభమైన సమావేశాలు 22వ తేదీ వరకు జరుగుతాయని మొదట పేర్కొన్నా ఒకరోజు ముందుగానే ముగిశాయి. ఈ సమావేశాల్లో బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకువచ్చిన మూడు క్రిమినల్ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. లోక్సభలో ఆమోదం పొందిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రాజ్యసభ వాయిదా వేశారు. రాష్ట్రపతి సంతకం అనంతరం భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్, భారతీయ సాక్ష్యా-బీఎస్ చట్టాలుగా మారనున్నాయి.
ఈ బిల్లుతో పాటు దేశ భద్రతను ప్రమాదం తలెత్తిన సమయంలో టెలికమ్యూనికేషన్ సేవలను ప్రభుత్వం అధీనంలోకి తీసుకునేలా ప్రవేశపెట్టిన టెలికాం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ప్రెస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరియాడికల్స్ బిల్లు 2023కు సైతం ఆమోదం తెలిపిన తర్వాత లోక్సభ వాయిదా పడింది. మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను నియమించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్సభ ఆమోదించింది. సీఈసీ, ఈసీల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం, వేతనాలకు సంబంధించిన అంశాలను పొందుపర్చిన ఈ బిల్లుకు రాజ్యసభ ఇప్పటికే ఆమోదం తెలిపింది.