తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి నిర్వహించే ‘ప్రజా పాలన’ ప్రారంభం కానుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలను అందించడమే ప్రజాపాలన లక్ష్యమని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అహంకార పూరిత పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఆయన తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ క్రమంలో ప్రజాపాలనపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఉర్దూలోనూ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దరఖాస్తులను ఉర్దూలో అందుబాటులోకి తేవాలని సీఎం, సీఎస్‌ను కోరుతున్నట్లు అసదుద్దీన్ తెలిపారు. అందరూ అవకాశాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలంటే స్థానిక భాషలన్నింటిలోనూ దరఖాస్తులు ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్‌కు తమ పార్టీ సహకరిస్తుందని, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం తప్పకుండా నిలదీస్తామని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.