కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి కాంగ్రెస్ ఒకే విధానంతోనే ఉందని.. మొదటి నుంచి ఈ ప్రాజెక్టుపై తమకు అనుమానాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను వివరించారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ ప్రాణహితను పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని అన్నారు. మేడిగడ్డ కుంగడం బాధాకరమని తెలిపారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ స్పందించలేదని మండిపడ్డారు.
“కాళేశ్వరం కంటే ప్రాణహితే ఉత్తమమైనది. మహారాష్ట్ర కొంతముంపుతో ప్రాణహిత పూర్తి అయ్యేది. ప్రాజెక్టు వ్యయాన్ని 80 వేల కోట్ల నుంచి లక్షన్నర కోట్లకు పెంచారు. కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టకు రూ.90 వేల కోట్లు ఖర్చు చేశారు. మేడిగడ్డ కుంగడమే కాదు.. అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజీ అయ్యింది. ఇంకా సుందిళ్లను పరిశీలించాల్సి ఉంది. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయాలు ప్రకటిస్తాం. కాగ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తీవ్రమైన విమర్శలు చేసింది. గతంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు 38 వేల కోట్లతో 16.40 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి నిర్ణయించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 80 వేల కోట్లు 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి నిర్ణయించింది.” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.