యాత్ర 2 టీజర్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. నిజాన్ని చెబితే ఎవరూ పేరడీలు చేయరని, అదే అబద్ధాన్ని చెబితే ఎన్ని రకాల పేరడీలు చేస్తారో యాత్ర 2 టీజర్ విడుదల అయిన తర్వాత సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మిమ్స్ చూస్తే అర్థమవుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవిత గాధ ఆధారంగా యాత్ర చిత్రాన్ని రూపొందించగా, ఆయన మరణానంతరం జగన్ మోహన్ రెడ్డి గారి జీవిత గాధ ఆధారంగా యాత్ర 2 రూపొందించినట్లు అర్థమవుతుందని అన్నారు.
ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుందని, వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారిపై అభిమానంతో యాత్ర సినిమాను ప్రేక్షకులు ఆదరించారని, కానీ యాత్ర 2 చిత్రాన్ని ఆదరించే అవకాశాలు మాత్రం శూన్యం అని అన్నారు. యాత్ర 2 చిత్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించిన సీన్స్ ఉంటాయో? ఉండవోనని రఘురామకృష్ణ రాజు గారు అనుమానాన్ని వ్యక్తం చేశారు. మధ్య నిషేధం అమలు చేయకపోతే, మళ్లీ ఎన్నికలకు రానని, మద్యం షాపులు లేకుండా చేయకపోతే మళ్లీ ఓట్లు అడగనని అన్న సీన్ ఉంటుందా?, అలాగే అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలో సీపీయస్ రద్దు చేస్తానన్న సీన్ ఉంటుందా??, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను… అమరావతియే రాజధాని అని జగన్ మోహన్ రెడ్డి గారు పేర్కొన్న సీన్ ఉంటుందా?? అని ప్రశ్నించారు.