చిన్నప్పుడు మన పెద్దలు తరచుగా హెచ్చరించే మాట ఒకటుంది,అదే “సంధ్య వేళలో చెడు మాటలు మాట్లాడొద్దు, తథాస్తు దేవతలు తిరుగుతుంటారు” అని. అసలు ఈ ‘తథాస్తు దేవతలు’ ఎవరు? సూర్యాస్తమయం అయ్యే ఆ పవిత్ర సమయంలో మన నోటి నుంచి వచ్చిన మాటలకు అంత శక్తి ఉంటుందా? పురాణాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్పే ఆసక్తికరమైన విషయాన్ని, ఆ సమయం యొక్క విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
సంధ్యా సమయం- శక్తిమంతమైన కాలం: సూర్యాస్తమయం అయ్యే ముందు, చీకటి పడే సమయంలో ఉండే కాలాన్నే సంధ్యా సమయం అంటారు. ఇది రోజులో అత్యంత శక్తివంతమైన కాలంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఈ సమయంలో పగలు, రాత్రి కలుస్తాయి. మన సనాతన ధర్మం ప్రకారం, ఈ సంధ్యా వేళలో కొన్ని ప్రత్యేక శక్తులు, దేవతలు లోక సంచారం చేస్తారు. ఈ సమయంలోనే తథాస్తు దేవతలు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారని పురాణ కథనాలు చెబుతున్నాయి.
తథాస్తు దేవతలు ఎవరు? పురాణ కథ: పురాణాల ప్రకారం ఈ తథాస్తు దేవతలు ఎవరో కాదు, అశ్వినీ కుమారులు. వీరు సూర్య భగవానుడికి, ఆయన భార్య అయిన సంజ్ఞా దేవికి జన్మించినవారు. సంజ్ఞా దేవి సూర్యుడి వేడిని భరించలేక గుర్రం రూపం ధరించి వెళ్లగా, సూర్యుడు కూడా అశ్వ రూపాన్ని ధరించి ఆమె వద్దకు వెళ్ళినప్పుడు వీరి కలయిక వల్ల అశ్వినీ కుమారులు ఉద్భవించారు. ఈ అశ్వినీ కుమారులు వైద్య దేవతలుగా సుప్రసిద్ధులు. వీరు అతి వేగంగా ప్రయాణిస్తూ, యజ్ఞాలు, యాగాలు జరిగే చోట సంచరిస్తూ, ఆ సమయంలో “తథాస్తు! తథాస్తు!” అని పలుకుతూ ఉంటారు. అంటే “అలాగే జరుగుగాక!” అని దీవించడం.

తథాస్తు దేవతలు తమ ప్రయాణంలో సంధ్యా సమయంలోనే ఎక్కువగా తిరుగుతారు. సరిగ్గా అదే సమయంలో మనం నోటి నుంచి పలికే మంచి లేదా చెడు మాటలు, లేదా మనం బలంగా కోరుకునే కోరికలను వారు విని తథాస్తు అని అనవచ్చని విశ్వసిస్తారు. అందుకే మన పూర్వీకులు ఈ సమయంలో కోపం, అసత్యాలు, చెడు ఆలోచనలు, నిందలు వంటి వాటికి దూరంగా ఉండాలని, కేవలం మంచి మాటలు, శుభాకాంక్షలు మాత్రమే పలకాలని, లేదా ధ్యానం చేయాలని చెబుతారు. మనసు, మాట శుద్ధిగా ఉంటేనే అద్భుత ఫలితం లభిస్తుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, సంధ్యా సమయంలో ముఖ్యంగా మన స్థితిగతుల గురించి అసత్యాలు లేదా అవాస్తవాలు పలకడం అస్సలు మంచిది కాదు.
