పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ విదేశీ పర్యటనకు బయల్దేరనున్నారు. మొదటగా ఈరోజు మణిపూర్‌లో రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభంలో రేవంత్ పాల్గొంటారు. అక్కడి నుంచి ఆయన దిల్లీ వెళ్తారు. దిల్లీ నుంచి రేవంత్ దావోస్ బయలుదేరుతారు. రేపటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు దావోస్లో పర్యటిస్తారు.
దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. సదస్సుకు వచ్చే వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులకు ఆహ్వానిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎంవో ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్దన్ రెడ్డి, సీఎస్ఓ తఫ్సీర్ ఇక్బాల్, భద్రతా అధికారి గుమ్మి చక్రవర్తి, మీడియా ప్రతినిధి కర్రి శ్రీరాం, సహచరుడు ఉదయ్ సింహా దావోస్ వెళ్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ నుంచి లండన్ వెళ్లి అక్కడ మూడు రోజులు పర్యటిస్తారు. మూసీ అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తున్నందున.. లండన్ లో థేమ్స్ నది అభివృద్ధి, పర్యాటకాన్ని సీఎం పరిశీలిస్తారు.