సంక్రాంతి పండగకు భాగ్యనగరమంతా సొంతూళ్లకు వెళ్లింది. శుక్ర, శని వారాల్లో ఎక్కువగా నగర వాసులు పెద్దఎత్తున పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై శుక్ర, శనివారాల్లో రికార్డుస్థాయిలో వాహనాలు ప్రయాణించాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా మీదుగా శుక్రవారం ఒక్క రోజే 68,628 వాహనాలు రాకపోకలు సాగించగా.. వీటిలో 54,595 కార్లున్నాయి.
మరోవైపు శనివారం రోజున వాహనాల రద్దీ మరింత ఎక్కువైంది. ఈ ఒక్కరోజే సుమారు 80 వేల వరకు వెళ్లి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫాస్ట్‌ట్యాగ్ స్కానింగ్‌కు సాధారణంగా 5 సెకన్ల సమయం పట్టింది. రద్దీలో టోలోప్లాజాకు చేరుకున్న తరువాత.. స్కానింగ్ దాటడానికి 5 నుంచి 10 నిమిషాల సమయం పట్టింది. చౌటుప్పల్‌లో ప్రధానంగా అండర్‌పాస్ వంతెన లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో రద్దీ తీవ్రమై.. వాహనచోదకులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చౌటుప్పల్ వద్ద విజయవాడ వైపు రద్దీ అధికంగా ఉండటంతో హైదరాబాద్ వచ్చే మార్గంలోనూ ఒక వరసలో విజయవాడ వెళ్లే వాహనాలను పోలీసులు అనుమతించారు. అయితే ఒక దశలో హైదరాబాద్ వైపు వచ్చే మార్గంలో మూడు వరుసల్లోనూ విజయవాడ వెళ్లే వాహనాలు నిండిపోయాయి.