హైదరాబాద్‌లో ఈనెల 18వ తేదీ నుంచి వింగ్స్ ఇండియా కార్యక్రమం జరగనుంది. విమాన రంగానికి మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం నగరంలోని బేగంపేట విమానాశ్రయం రెడీ అవుతోంది. ఈనెల 21వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు కనువిందు చేయనున్నాయి.
విమానయానానికి ప్రజలను మరింత చేరువ చేసే ఉద్దేశంతో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ రంగానికి ఉన్న అవకాశాలను వ్యాపారవేత్తలకు, అంకుర పరిశ్రమలకు అవగాహన కల్పించడం కూడా ఈ ప్రదర్శన ఉద్దేశమే. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్‌తో పాటు పలు రకాల విమానాలను ఈ షోలో ప్రదర్శించనున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు వాహనాలను మళ్లించనున్నారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎస్ శాంతి కుమారి, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.