సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీ బాగా కలిసొచ్చింది. విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో ప్రజలు పెద్దఎత్తున సొంతూళ్లకు వెళ్లారు. రవాణా సాధనగా దాదాపు ఎక్కువ మంది బస్సులనే ఎంచుకున్నారు. దీంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ 6వేల 261 ప్రత్యేక బస్సులను నడిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఆర్టీసీ బస్సుల్లో 52లక్షల 78వేల మంది ప్రయాణించగా రూ.12 కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరినట్లు అంచనా వేశారు. ఇటీవలి కాలంలో ఇదే రికార్డు ఆదాయం అని తెలిపారు.
మహిళలకు మహాలక్ష్మి – ఉచిత ప్రయాణం తర్వాత టికెట్ ఆదాయం భారీగా పెరగడం ఇదే తొలిసారి అని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. సంక్రాంతి సందర్భంగా గడిచిన మూడ్రోజుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోయింది. ఈనెల 13వ తేదీన ఒక్కరోజే 18వందల 61 ప్రత్యేక బస్సులను నడిపించగా.. ఇందులో వెయ్యి 127 హైదరాబాద్ సిటీ బస్సులను ప్రయాణికుల కోసం వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 6వేల 261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు వెల్లడించారు.