ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.భక్తులు ముందుగా స్థానిక జంపన్న వాగులో స్నానము చేసి, వనదేవతలకు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించారు .గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చల్లంగ చూడు తల్లీ అంటూ సమ్మక్క సారలమ్మ లను వేడుకుని యాటపోతులను సమర్పించి జాతర పరిసరాల్లో విడిది చేశారు.
భక్తులు విడిది చేయడంతో జాతర పరిసరా ప్రాంతాలు రద్దీగా మారాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో అనుమతించారు. కాగా బుధవారం ఒక్కరోజే జాతరకు 50 వేల మంది భక్తులు వచ్చినట్లు సమాచారం .