జ్వరం వచ్చిన ప్రతిసారీ మన పెద్దలు లేదా స్నేహితులు స్నానం చేయకూడదు అని సలహా ఇస్తూ ఉంటారు. అయితే ఇది నిజమా? జ్వరం (Fever) వచ్చినప్పుడు శరీరం వేడిగా, అసౌకర్యంగా ఉన్నప్పుడు స్నానం చేయడం అనేది కేవలం పరిశుభ్రత కోసమే కాదు,శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఈ పాత నమ్మకం వెనుక ఉన్న వాస్తవం ఏమిటి? జ్వరం ఉన్నప్పుడు ఏ రకమైన స్నానం మేలు చేస్తుంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
జ్వరం ఉన్నప్పుడు స్నానం: వాస్తవం గా చెప్పలి అంటే స్నానం చేయకూడదు అనేది ఒక అపోహ (Myth) మాత్రమే. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయడం వల్ల అది కూడా సరైన పద్ధతిలో చేస్తే లాభమే కానీ నష్టం లేదు.
అసలు చేయవలసినది ఏమిటి: జ్వరం ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. శరీర ఉష్ణోగ్రత తగ్గుదల: గోరువెచ్చని నీరు ఆవిరైపోయేటప్పుడు, అది చర్మం ఉపరితలం నుండి కొంత వేడిని (Heat) తీసుకువెళుతుంది. దీనివల్ల శరీరం సహజంగా కొద్దిగా చల్లబడుతుంది. జ్వరం కారణంగా వచ్చే అలసట, ఒళ్లు నొప్పులు మరియు చిరాకు తగ్గుతాయి. పరిశుభ్రత వల్ల మానసికంగా కూడా రిఫ్రెష్‌గా అనిపిస్తుంది.

చేయకూడనిది ఏమిటి: చల్లని నీరు: జ్వరం ఉన్నప్పుడు చల్లటి నీటితో స్నానం చేయకూడదు. చల్లటి నీరు కండరాలను బిగుసుకుపోయేలా చేస్తుంది మరియు శరీరాన్ని వేడిని పెంచడానికి మరింత శక్తిని ఉపయోగించేలా చేస్తుంది. దీనివల్ల వణుకు (Shivering) వచ్చి, జ్వరం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఎక్కువసేపు స్నానం: జ్వరంగా ఉన్నప్పుడు ఎక్కువసేపు నిలబడి లేదా కూర్చుని స్నానం చేయకూడదు. త్వరగా స్నానం ముగించి వెంటనే పొడి తువాలుతో శుభ్రంగా తుడుచుకుని, వెచ్చని దుస్తులు ధరించాలి.
అధిక జ్వరం: మీ జ్వరం 103°F (39.4°C) కంటే ఎక్కువగా ఉంటే లేదా మీరు వణుకుతున్నట్లయితే, స్నానం కంటే, నుదిటిపై మరియు మెడపై గోరువెచ్చని నీటిలో తడిపిన గుడ్డ ఉంచుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
బలహీనత: నిలబడలేని బలహీనత ఉంటే, కింద పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, స్నానానికి బదులుగా గోరువెచ్చని నీటితో స్పాంజ్ బాత్ తీసుకోవడం మంచిది.
జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయకూడదు అనే పాత నమ్మకం అశాస్త్రీయమైనది. వాస్తవానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఉష్ణోగ్రత నియంత్రణకు మరియు శారీరక, మానసిక ఉపశమనానికి చాలా సహాయపడుతుంది. కాబట్టి అసౌకర్యంగా అనిపించినప్పుడు ధైర్యంగా గోరువెచ్చని స్నానం చేయండి.
గమనిక: జ్వరం అనేది ఒక వ్యాధి లక్షణం మాత్రమే. అది తగ్గకపోతే లేదా ఇతర తీవ్రమైన లక్షణాలు ఉంటే స్నానం గురించి కాకుండా తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ముఖ్యం.