అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. భద్రాచలంలో అట్టహాసంగా రథోత్సవం

-

500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. కోట్ల మంది హిందువుల ఎదురుచూపులు మరికొన్ని క్షణాల్లో ఫలించనున్నాయి. ఎన్నో ఏళ్ల శ్రీరామభక్తుల అయోధ్య రామమందిరం కల ఇంకాసేపట్లో సాకారం కానుంది. అయోధ్య నగరంలో రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 12.20 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. కోట్ల మంది ప్రజల ప్రత్యక్ష, పరోక్ష వీక్షణ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

మరోవైపు అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల శ్రీరామ శోభాయాత్రలు కూడా జరుపుతున్నారు. మరోవైపు ప్రసిద్ధ భద్రాచలం రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామివారి పాదాల వద్ద స్వర్ణ పుష్పాలను ఉంచి అర్చన చేసిన అనంతరం శ్రీరామ రథంతో పట్టణంలో రథయాత్ర చేపట్టారు. వేద మంత్రోచ్ఛరణ, మంగళవాద్యాలు, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి రథయాత్ర రంగరంగ వైభవంగా కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ‘జై శ్రీ రామ్‌’ నినాదాలతో కాషాయ జెండాలను ఊరేగించారు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news