‘రా.. కదలిరా!’ అన్న పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలి రా’ అని ఇచ్చిన నినాదానికి జనం నుంచి మంచి ఆదరణ వస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఉరవకొండలో టీడీపీ ‘రా.. కదలిరా’ సభ నిర్వహిస్తోంది. ఈ బహిరంగ సభలో చంద్రబాబు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎంకి ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఉరవకొండ సభలో మాట్లాడుతూ ‘ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా వచ్చింది. హ్యాపీగా దిగిపోతా అని ఇప్పుడు అంటున్నారు. రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉంది. వైసీపీ పాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటీ లేదు. ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది’ అని విమర్శించారు.