భీమిలి తీరం జనసంద్రమైంది. అభిమానమంటే ఇది కదా అనే రీతిలో అపూర్వ స్పందన లభించింది. సంక్షేమ ఫలాలు పొందిన వారంతా స్వచ్ఛందంగా తరలివచ్చారు. జరిగిన మేలును హృదయాంతరాల్లో ఉంచుకుని కరతాళధ్వనులు వినిపించారు. బలహీనులకు సర్కారు అందించిన సాయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని చప్పట్ల రూపంలో కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు సిద్ధమంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంఖారావం పూరించిన భీమిలి సభ జన సునామీని తలపించింది . జైజగన్ నినాదాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. కనీవినీ ఎరుగని రీతిలో అభిమానజనం విచ్చేశారు. పెత్తందారులు పేదలకు మధ్య జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో సీఎం వెంటే ఉంటామని ఈ ఎన్నికల్లో జైత్రయాత్ర కొనసాగడం తథ్యమని సీఎంకి భరోసా ఇచ్చారు.
ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌కి ప్రాధాన్యమిస్తూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భీమిలి వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు.ఉత్తరాంధ్రలోని విశాఖపట్టణం, విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 34 అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్‌సీపీ నాలుగు లక్షల మందికి సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారు. సిద్దం పేరుతో ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని భీమిలి వేదికగా మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లను కౌరవ సేనతో పోల్చి… వారికి అవకాశం ఇవ్వవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలను, 25 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ప్రజలే వైసీపీకి స్టార్ కాంపెయినర్‌లుగా వ్యవహరిస్తారని చెప్పారు.
భీమిలిలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగం రొటీన్‌కి భిన్నంగా సాగింది.భీఓవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం కనిపిస్తోందన్నారు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ, జనసేన కూటమికి అభ్యర్ధులు కూడా లేరని, కొత్త వాగ్థానాలతో గారడీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మరో 70 రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయని.. అబద్ధానికి, నిజానికి మధ్య .. మోసం, విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగబోతోందన్నారు.ఈ 56 నెలల్లో గ్రామాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చంద్రబాబు ఏం చేశారో చెప్పడానికి ఏమీ కనిపించదన్నారు. 2014లో చంద్రబాబు 570 వాగ్ధానాలు ఇచ్చారని.. వైసీపీ ప్రభుత్వంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నామని జగన్ తెలిపారు.
ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని, 670 వాగ్ధానాల్లో 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదని సీఎం దుయ్యబట్టారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశామని, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామన్నారు. రుణమాఫీ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు మోసమేనని, 14 ఏళ్ల పాలనలో ఆయన మార్క్ ఏంటి అని జగన్ ప్రశ్నించారు. పేద సామాజిక వర్గాల మీద నాకు ప్రేమ వుంది కాబట్టే సగం నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు.ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యానించారని సీఎం ధ్వజమెత్తారు. 2 లక్షల 13 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొచ్చామని, ఎక్కడ చూసినా కనిపించేది వైసీపీ మార్కేనని జగన్ పేర్కొన్నారు. గ్రామాల్లో 5 వందలకుపైగా పౌర సేవలు అందిస్తున్నామని సీఎం చెప్పారు. ఇవాళ రైతు భరోసా అంటే గుర్తొచ్చేది మీ జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు.
పేద కులాలకు చెందిన నలుగురిని డిప్యూటీ సీఎంలుగా చేశామని జగన్ చెప్పారు. 80 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలకే ఇచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇన్ని నిజాలు తెలిశాక.. చంద్రబాబుకు ఎవరైనా ఓటు వేస్తామని అనగలరా అని జగన్ ప్రశ్నించారు.పేదలకు చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సుపరిపాలన తీసుకొచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి న్యాయం చేశామని, ఏకంగా 2 లక్షల 53 వేల కోట్లను అక్కాచెల్లెమ్మల ఖాతాలో జమ చేశామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు అందజేశామని సీఎం గుర్తుచేశారు. మన ఐదేళ్ల పాలనలో మహిళలు, రైతులు, అవ్వాతాతల బ్యాంక్ ఖాతాల్లో ఎం వేశామో చూడాలని జగన్ సూచించారు. మొత్తానికి వైసీపీ ఉత్సాహం చూస్తుంటే ఈసారి 175 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 25 ఎంపీ సీట్లను కూడా గెలుస్తుందని చెప్పవచ్చు