యూపీలో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.తిరిగి ఆరు నెలల్లో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. పరీక్షల పవిత్రతలో రాజీపడే ప్రసక్తే లేదు.. యువత కష్టార్జితంతో ఆడుకున్న ఇలాంటి వికృత శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
కాగా,ఫిబ్రవరి 17,18 తేదీల్లో యూపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష జరగింది.యూపీలోని 75 జిల్లాల్లోని 2,385 పరీక్షా కేంద్రాల్లో ఈ నియామక పరీక్ష జరిగింది.60 వేల 244 పోస్టులకు 48 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.రోజుకు రెండు షిఫ్టుల్లో జరిగిన ఈ పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా నిషేధం విధించారు. బ్లూటూత్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అంతరాయం కలిగించడానికి వారు జామర్లను అమర్చినప్పటికీ కూడా పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.ఇక ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.